Friday, June 10, 2005

ఇతర చింత లిక నేమిటికి etc..

గుండక్రియ

ఇతర చింత లిక నేమిటికి
అతడే గతియై అరసేటివాడు

కర్మమూలమే కాయము నిజ
ధర్మమూలమే తనయాత్మ
అర్మిలి రెంటికి హరియొకడే
మర్మ మీతడే మనిపేటివాడు

బహుభోగమయము ప్రపంచము
నిహితజ్ఞానము నిజముక్తి
ఇహపరములకును యీశ్వరుడే
సహజపుకర్తై జరపేటివాడు

అతిదుఃఖకరము లానలు
సతతసుఖకరము సమవిరతి
గతి యలమేల్మంగతో శ్రీవేంకట
పతి యొకడిన్నిట బాలించువాడు

--అన్నమయ్యపాట
**********************************************

శంకరాభరణం

అచ్చుత మిమ్ముదలచేయంతపని వలెనా
యిచ్చల మీవారే మాకు నిహపరా లియ్యగా

మిమ్ము నెఱిగినయట్టిమీదాసుల నెఱిగే_
సమ్మవిజ్ఞానమే చాలదా నాకు
వుమ్మడి మీసేవ సేసుకుండేటివైష్ణవుల_
సమ్ముఖాన సేవించుటే చాలదా నాకు।

నిరతి నీకు మొక్కేనీడింగరీలకు
సరవితో మొక్కుటే చాలదా నాకు
పరగ నిన్ను బూజించే ప్రసన్నుల బూజించే_
సరిలేనిభాగ్యము చాలదా నాకు।

అంది నీకు భక్తులై నయలమహానుభావుల_
చందపువారిపై భక్తి చాలదా నాకు
కందువ శ్రీ వేంకటేశ కడు నీబంటుబంటుకు
సందడిబంటనవుటే చాలదా నాకు ।

**********************************************************

నవనీతచోర నమో నమో
నవమహిమార్ణవ నమో నమో।

హరి నారాయణ కేశవాచ్యుత శ్రీకృష్ణ
నరసింహ వామన నమో నమో
మురహర పద్మ నాభ ముకుంద గోవింద
నరనారాయణరూప నమో నమో

నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవ
నగధర నందగోప నమో నమో
త్రిగుణాతీత దేవ త్రివిక్రమ ద్వారక_
నగరాధినాయక నమో నమో।

వైకుంఠ రుక్మిణీవల్లభ చక్రధర
నాకేశవందిత నమో నమో
శ్రీకరగుణనిధి శ్రీ వేంకటేశ్వర
నాకజనననుత నమో నమో

*********************************************************

శంకరాభరణం

అతడే సకలము అని భావింపుచు
నీతితో నడవక నిలుకడ యేది

యెందును జూచిన యీశ్వరు డుండగ
విందుల మనసుకు వెలితేది
సందడించేహరిచైతన్య మిదివో
కందువలిక వెదకగ నేది

అంతరాత్ముడై హరి పొడచూపగ
సంతపుకర్మవుభయ మేది
సంతత మాతడే స్వతంత్రుడిదివో
కొంత గొంత మరి కోరెడి దేది,

శ్రీవేంకటపతి జీవుని నేలగ
యీవల సందేహ మిక నేది
భావం బీతడు ప్రపంచ మీతడు
వేవేలుగ మరి వెదకేది దేది।

******************************************************

సాళంగనాట

అద్దిగా వోయయ్య నే నంతవాడనా! వొక_
కొద్ది నీదాసులసేవ కోరగలగాక

హరి నీమాయలకు నే నడ్డము చెప్పేవాడనా
అరిదైన దదియు రాచాజ్ఞ గనక
పరమ పదాన కానపడుటయు ద్రోహము
సొరిది నీభండారము సొమ్ముగనక

పంచేద్రియముల నే బారదోలేవాడనా
ముంచి నీవు వెట్టినట్టి ముద్ర కర్తలు
అంచల నావిజ్ఞాన మది దహించవచ్చునా
నించి నీవు పాతినట్టినిధాన మది

వొట్టి సంసారపు మోపు నోపననేవాడనా
వెట్టి మమ్ము జేయించేటివేడుక నీది
గట్టిగా శృఈవేంకటేశ కదిసి నీశరణంటి
ఱట్టుగ నే జెప్పేనా మీఱగ నీరహస్యము

************************************************


రామక్రియ

ఇచ్చలో గోరేవల్లా ఇచ్చేధనము
అచ్చుతనామమెపో అధికపుధనము

నారదాదులువొగడేనాలుకపయిధనము
సారపువేదములలో చాటేధనము
కూరిమిమునులు దాచుకొన్నట్టిధనము
నారాయణనామ మిదే నమ్మినట్టిధనము

పరమపదవికి సంబళమైనధనము
యిరవై భక్తులకెల్లా నింటిధనము
పరగ నంతరంగాన పాతినట్టిధనము
హరినామ మిదియపో అరచేతిధనము

పొంచి శివుడు కాశిలో బోధించేధనము
ముంచినాఅచార్యుల మూలధనము
పంచి శ్రీ వేంకటపతి పాలించేధనము
నించి విష్ణునామ మదే నిత్యమైనధనము।

***********************************

శ్రీరాగం

ఇతనికంటె ఘనులిక లేరు
యితరదేవతలయిందరిలోన

భూపతి యీతడె పొదిగి కొలువరో
శ్రీపతి యీతడే చేకొనరో
యేపున బలువుడు నీతడే చేరరో
పైపై వేంకటపతి యైనాడు।

మరుగురు డితడే మతి నమ్మగదరో
పరమాత్ము డితడె భావించరో
కరివరదు డితడె గతి యని తలచరో
పరగ శ్రీ వేంకటపతి యైనాడు

తల్లియు నితడే తండ్రియు నితడే
వెల్లవిరై యిక విడువకురో
చల్లగా నితని శరణని బ్రతుకరొ
అల్ల శ్రీవేంకటహరి యయినాడు

***********************************

లలిత

చూడ వేడుకలు సొరిది నీమాయలు
తోడనే హరి హరి దొరసీ నిదివో

పుట్టేటిజీవులు పొదలేటిజీవులు
జట్టిగొని రిదియే జగమెల్లా
కట్టిడికర్మము కాయజుమర్మము
నెట్టుకొన్న దిదెనిఖిలంబెల్లా

ములిగేటిదనములు మోచేటిధనములు
కలిమి మెరసె లోకంబెల్లా
పొససి వేగుటలు పొద్దు గుంకుటలు
కలిగిన విదివో కాలంబెల్లా

లేటిపురుషులు తమకపు కాంతలు
బగివాయని దీబదుకెల్లా
అగపడి శ్రీవేంకటాధిప నీకృప
దెగనీజివనము దినదినమెల్లా।

*************************************************

దేవగాంధారి

ఎన్నడొకో నే దెలిసి యెక్కుడయి బ్రదికేది
పన్నిననాగుణమెల్లా భ్రమత పాలాయ।

ధనమద మిదె నన్ను దైవము నెఱ గనీదు
తనుమద మెంతయిన తపము జేయనీదు
ఘన సంసారమదము కలుషము బాయనీదు
మవెడినామనువెల్ల మదముపాలాయ।

పొంచి కామాంధకారము పుణ్యము గానగనీదు
కంచపుజన్మపుచిక్కు గతి చూపదు
పెంచి యజ్ఞానతనము పెద్దల నెరగనీదు
చించరానినాబుద్ది చీకటిపాలాయ।

శ్రీ వేంకటేశ్వరమాయ చిత్తము దేరనీదు
యేవంకా నీతడే గతి యిన్నిటా మాకు
యేవుపాయమును లేక యీతని మఱగు చొచ్చి
దేవుడంతర్యామి యని తేజము బొందితిమి।

No comments: