Thursday, July 28, 2005

దేపాళం

ఎన్నడు దీరీ నీతెందేపలు (?)

పన్నిన జీవులబంధములు.

భారపుజిత్తము ప్రవాహరూపము

వూరెటిమదములు వీటెత్తె

తీర వింద్రయపుదేహభ్రాంతులు

కోరేటికోర్కుల గొండలు వెరిగె

ఉడికేటిపాపము లుగ్రనరకములు

తొడికేటికర్మము తోడంటు

విడువవు భవములు వెంటవెంటనే

చిడుముడి జిత్తము చీకటి వడెను.

రపణపుభవములు రాట్నపుగుండ్రలు

చపలపుబుద్దులు జలనిధులు

ఇపుడిదె శ్రీవేంకటేశుడ నీవే

కపటమువాయగ గరుణించితివి.

ముఖారి

నీవెంత నేనెంత నీకు నాకు నెంతదవ్వు

దైవమా సిగ్గుపడక తగిలే నేగాకా

చెంది నీకు బ్రహ్మాదులు సేవలు సేయుగాను

యిందు మాసేవలు నీకు నేడకువచ్చు

పొంది వసిష్ఠాదులట్టే పూజలు సేయగాను

సందడి మాపూజలు సరకా నీకు

సనకాదియోగులు సారె నిన్ను దలచగా

యెనసి మాతలపు నీ కేడకెక్కును

నునుపుగా శేషాదులు నుతులు నిన్ను జేయగా

పనివడి మానుతులు బాతేయనా నీకు.

కిట్టి నారదాదులు నీకింకరులై వుండగాను

యిటె నీదాసుడనను టెంత కెంత

వొట్టి శ్రీవేంకటేశ మాకొకవుపాయము గద్దు

పట్టి నీదాసులబంటుబంట నయ్యేనికను.

ళలిత

అయ్యో వికల్పవాదులంతటా సిగ్గువడరు

యియ్యెడ నెట్టుగలిగె నీయసురమతము.

నీముద్రలూ నొల్లరు నీదాసోహము నొల్లరు

కామించి నీమీదిభక్తి కడు నొల్లరు

నామమంత్రము నొల్లరనామయుండ వనెందురు

తాము వైష్ణవుల మంటా దర్కింతురు.

పైకృతవేళ నీప్రసాదమూ నొల్లరు

ఘాతలనూర్ధ్వపుండ్రము గాదందురు

ఝాతరదైవాల నిన్ను సరిగా బూజింతురు

ఆఅతల వైష్ణవులు దామనుకొందురు..

శ్రీవైష్ణవుల గంటే జేతులెత్తి మొక్కరు

భావింతురు పగ వారిబలె గన్నట్టు

ఆఅవల వైకుంఠమూ ననిత్యమందురు

కావించి వైష్ణవులము కామా నే మందురు.

వరుస రావణాదులవలె నెజ్ఞాలు సేతురు

శరుస నట్టే వేదమూ జదువుదురు

ణిరతి శ్రీవేంకటేశ నీమహిమ లెరగక

ఆరిది వైష్ణవులమే యని యాడుకొందురు.

గుండక్రియ

నీయంతవారు గారు నిండుసామర్థ్యము లేదు

యీయహంకారపుముక్తి యీడేరీనా తమకు.

నీసేవలే సేసి నీకృప రక్షించగాను

ఆసల బొందేముక్తి అదిచాలక

నీసరివారలై నీవే తామనుకొని

యీసుల బొందేముక్తి యీడేరీనా తమకు

పొంచిన రాక్షసులెల్ల పూర్వదేవతలమంటా

యెంచుక పెట్టినమద మీగర్వము

అచెల గర్మమే సేసేరాయాదేవతల గూర్చి

ఇంచుకంతలోనే ముక్తి యీడేరీ నా తమకు.

హరిలాంఛనపుభక్తి కందుకు నొడబడరు

సరి రోగికి బథ్యము చవిగానట్టు

గరిమ శ్రీవేంకటేశు గైన్‌ మననివారికి

యెరవులనే ముక్తి యీడేరీనా తమకు.

బౌళి

వట్టిమోపు మోయనేల వడి ములుగగనేల

వట్టిన నేమముతోడ బ్రదుక గవలదా.

తల్లిదండ్రిగలవారు తమలేము లెఱగక

చెల్లపిళ్లలై యాటల జెందినయట్టు

వుల్లములో హరినమ్మివుండినప్రపన్నులెల్ల

పల్లదాన నిర్భరులై బ్రతుకగవలదా.

మగడుగలసతులు మంచి ముత్తైదువలై

యెగువ నితరమార్గా లెరగనట్టు

నగుతా లక్ష్మీపతి నమ్మినప్రపన్నులెల్ల

పగటు గర్మము మాని బ్రదుకగవలదా.

యేలికె నమ్మినబంటేరికి బ్రియము చెప్ప

కోలి బతివాకిలి గాచుండినయట్టు

తాలిమి శ్రీవేంకటేశుదాసులైనప్రపన్నులు

పాలించినాతని నమ్మి బ్రతుకగవలదా.

Thursday, June 16, 2005

సాళంగనాట

అని రావణుతల లట్టలు బొందించి
చెనకి భూతములు చెప్పె బుద్ది

కట్టిరి జలనిధి కపిసేన లవిగో
చుట్టు లంక కంచుల విడిసె
కొట్టిరి దానవకోట్లతల లదే
కట్టిడిరావణ గతియో నీకు

యెక్కిరి కోటలు యిందరు నొకపరి
చిక్కిరి కలిగినచెరయెల్ల
పక్కన సీతకు బరిణామమాయ
నిక్కము రావణ నీకో బ్రదుకు

పరగ విభీషణు బట్టము గట్టెను
తొరలి లంకకును తొలుదొలుతే
గరిమెల శ్రీవేంకటగిరి రాముడు
మెరసెను రావణ మేలాయ బనులు


********************************

దేవగాంధారి

దైవము నీవే యిక దరి చేరుతువుగాక
జీవులవసము గాదు చిక్కిరి లోలోననే

పుట్టుట సహజ మిది పొదలేజీవులకెల్ల
గట్టిగా జగమునందు కలకాలము
నట్టేటివరదవలె నానాటినీమాయ
కొట్టుక పారగజొచ్చె కూడినవిజ్ఞానము

పాపమే సహజము బద్దసంసారులకెల్ల
కాపురపువిధులలో కలకాలము
తేపలేనిసముద్రమురెరగున కర్మమెల్లా
మాపురేపు ముంచజొచ్చె మతిలోనిధైర్యము

లంపటమే సహజము లలి దేహధారులకు
గంపమోపు కోరికెలకలకాలము
యింపుల శ్రీవేంకటేశ ఇదె నీదాసులని
పంపుసేసి బ్రదికించె ప్రపన్నసుగతి

********************************

గుండక్రియ

ఇట్టి నాస్తికులమాట యేమని సమ్మెడి దిక
పట్టి సములమంటానే భక్తుల దూషింతురు

వేదములు చదువుతా విశ్వమెలా గల్లనేరు
ఆదెస తాము పుట్టుండి అదియును మాయనేరు
పాదగువిష్ణుడుండగ బయలు తత్వమనేరు
లేదు జీవతత్వమంటా లేమల బొందుదురు

తిరమై తమ ఇండ్ల దేవపూజలు సేసేరు
ధరలోన తముదామే దైవమనేరు
ఆరయగర్మమె బ్రహ్మమని యాచరించేరు
సరి నదే కాదని సన్యసించేరు

అందుక పురుషసూక్తమర్థము జెప్పుదురు
కందువ నప్పటి నిరాకారమందురు
యిందులో శ్రీవేంకటేశ యిటె నీ దాసులుగాక
మందపురాక్షసులాడేమతము నడతురు

******************************************

వసంతవరాళి

ఇహము బరము జిక్కె నీతనివంక
అహిశయనునిదాసులంతవారు వేరీ

సిరికలిగినవారు చింతలిన్నిటను బాసి
నిరతపువర్గముతో నిక్కేరటా
సిరికి మగడయిన శ్రీపతి యేలి మ__
మ్మరయుచునున్నాడు మాయంతవారు వెరి

బలవంతుడైనవాడు భయములిన్నిట బాసి
గెలిచి పేరువాడుచు గెరిలీనటా
బలదేవుడైన శ్రీపతి మా యింటిలోన
అలరివున్నాడు మాయంతవారు వేరి

భూములేలేటివాడు భోగములతో దనిసి
కామించి యానందమున గరగీనటా
సేమముతో భూపతైన శ్రీవేంకటేశుడు మాకు
ఆముకొనివుండగా మాయంతవారు వేరీ

**********************************

మాళవిగౌళ

అన్నియు నీతనిమూల మాతడే మాపలజిక్కె
కన్నుల మావేడుకకు కడయేది యికను

కామధేనువు గలిగితే గర్వించు నొక్కరుడు
భూమి యేలితే నొకడు పొదలుచుండు
కామించి నిధి గంటె కళలమించు నొకడు
శ్రీమంతుడగుహరి చిక్కె మాకు నిదివో

పరుసవేదిగలిగితే పంతములాడు నొకడు
ధర జింతామణబ్బితే దాటు నొకడు
సురలోక మబ్బితేను చొక్కుచునుండు నొకడు
పరమాత్ముడే మాపాలజిక్కెనిదివో

అమృతపానముసేసి యానందించు నొకడు
భ్రమసు దేహసిద్ది బరగొకడు
తమి శ్రీవేంకటేశుడే దాచినధనమై మాకు
అమరి నామతి జిక్కె నడ్డాములే దిదివో

************************************

దేవగాంధారి

పట్టరో వీదుల బరువులు వెట్టి
పుట్టుగులతో హరి పొలసీ వీడే

వేవేలు నేరాలు వెదకేటిదేవుడు
ఆవుల గాచీ నలవాడే
పోవుగ బ్రాహ్మల బుట్టించుదేవుడు
సోవల యశోదసుతుడట వీడే

ఘనయజ్ఞములకు గర్తగుదేవుడు
కినిసి వెన్న దొంగిలె వీడే
మునులచిత్తములమూలపుదేవుడు
యెనసీ గొల్లెతలయింటింట వీడే

నుడిగి నారదుడు నుతించుదేవుడు
బడిరోలగట్టువడె వీడే
వుడివోనివరము లొసగెడుదేవుడు
కడగిన శ్రీ వేంకటగిరి వీడే

**************************

భైరవి

వెఱ్రివారి దెలుపుటవేవేలు సుకృతము
ముఱ్రుబాలమంకే కాని ముందు గాన దైవమా

ఇంతకతొల్లిటిజన్మ మెటువంటిదో యెరగ
పొంతనే ఇటమీదటిపుట్టు వెరగ
పొంతనే ఇటమీదటిపుట్టు వెరగ
అంతరాన బెరిగేకాయమే నాకు సుఖమై
సంతసాన మురిసేను సంసారమందును

వొడలిలోపలిహేయ మొకైంతా దలచను
బడి నెదిటిదేహాలవచ్చి దలచ
సుడిసి పైపచారాలే చూచి సురతసుఖాన
పడతుల బొంది పొంది పరిణామించేను

పాపమూలమున వచ్చేబలునరకము లెంచ
యేపున బుణ్యపుబుద్ది ఇంచుకా నెంచ
దీపన జంతువును దెచ్చి పాపను జేసితి
చేపట్టి నన్ను రక్షించు శ్రీవేంకటేశుడా

*************************************

ఎందరితో బెనగేను యెక్కడని పొరలేను
కందర్ప జనక నీవే గతిగాక మాకు


నిక్కి నాబలవంతాన నేనే గెలిచేనంటే__
నొక్కపంచేంద్రియముల కోపగలనా
తక్కినసంసారవార్ది దాటగలనో మరి
దిక్కుల కర్మబంధము తెంచివేయగలనో

పన్నుకొన్నపాయమున పరము సాధించేనంటే
యెన్న నీమాయ కుత్తర మియ్యగలనా
వన్నెలనామనసే పంచుకోగలనో మరి
కన్నట్టి యీప్రపంచమే కడవగగలనో

వుల్లములో నిన్ను ధ్యాన మొగి నేజేసేనంటే
తొల్లిటియజ్ఞానము తోయగలనా
ఇల్లిదే శ్రీవేంకటేశ యెదుటనే నీకు మొక్కి
బల్లిదుడ నౌదుగాక పంద నే గాగలనా

*************************************

ఆహిరి

అయ్యో నానేరమికే అట్టే యేమని వగతు
ముయ్యంచుచంచలాన మోసపోతిగాక

కాననా నావంటివారే కారా యీజంతువులు
నానా యోనుల బుట్టి నడచేవారు
మానక నాగర్వమున మదాంధమున ముందు
గానక భయపడినకర్మి నింతేకాక

చదువనా నేదొల్లి జన్మజన్మాంతరముల
ఇది పుణ్య మిది పాప మింతంతని
వదలక నాభోగవాంఛలే పెంచి పెంచి
తుదకెక్క వెదకనిదుషుడనేను

వినవా నే బురాణాల వెనకటివారినెల్ల
మనెడిభాగవతులమహిమలెల్లా
యెనయుచు శ్రీవేంకటేశుకృపచేత నేడు
ఘనుడ నయితిగాక కష్టుడగానా


********************************

సాళంగనాట

ఆముస్వతంత్రులు గారు 'దాసోహము' నన లేరు
పామరపుదేహులకు పట్టరాదు గర్వము

పరగుబ్రహ్మాదులు బ్రహ్మమే తా మనలేరు
హరికే మొరవెట్టేరు ఆపదైతేను
ధరలో మనుజులింతే తామే దయివమనేరు
పొరి దాము చచ్చిపుట్టే పొద్దెరగరు

పండినవ్యాసాదులు ప్రపంచము కల్లనరు
కొండలుగా బురాణాల గొనియాడేరు
అండనే తిరిపెములై అందరినడిగి తా_
ముందుండి లేదనుకొనే రొప్పదన్నా మానరు

సనకాదియోగులు శౌరిభక్తి సేసేరు దు_
ర్జనులు భక్తి వొల్లరు జ్ఞానులమంటా
నినుపయి శ్రీవేంకటేశ నిను జేరి మొక్కుతానె
అనిశము నిరాకారమనేరు యీద్రోహులు

***************************************

శంకరాభరణం

ఎట్టు మోసపోతి నేను యివియెల్ల నిజమని
నెట్టాన హరినే నమ్మనేర నయితిగా

దేహమిది నాదని తెలిసి నమ్మివుండితే
ఆహా నే నొల్లనన్నా నటే ముదిసె
వూహల నాభోగమెల్లా వొళ్ళబట్టెనంటా నుంటే
దాహముతోడ నినుముదాగిననీరాయగా

మనసు నాదని నమ్మి మది మది నే పెంచితి__
ననుగుబంచేంద్రియములందు గూడెను
యెనసి ప్రాణవాయువు లివి సొమ్మని నమ్మితి
మెనసి లోను వెలినై ముక్కు వాత నున్నవి

ఇందుకొరకె నేను ఇన్నాళ్ళు పాటువడితి
ముందు వెనకెంచక నే మూఢుడ నైతి
అంది శ్రీవేంకటేశ్వరు డంతటా నుండి నా_
చందము చూచి కావగ జన్మమే యీడేరె

*******************************************

నాట

ఎందరైన గలరు నీ కింద్రచంద్రాదిసురలు
అందుర్లో నే నెవ్వడ నీ వాదరించే దెట్టో

పెక్కుబ్రహ్మాండములు నీపెనురోమకూపముల
గిక్కిరిశున్న వందొకకీటమ నేను
చక్కగా జీవరాసులసందడి బడున్నవాడ
ఇక్కువ నన్ను దలచి యెట్టు మన్నించేవో

కోటులైనవేదములు కొనాడీ నిన్నందులో నా_
నోటివిన్నపము లొక్క నువ్వు గింజంతే
మాటలు నేరక కొఱమాలి వాకిట నుండ
బాటగా నీదయ నాపై బారుటెట్టో

అచ్చపునీదాసులు అనంతము వారలకు
రిచ్చల నే నొకపాదరేణువ నింతే
ఇచ్చగించి శ్రీవేంకటేశ నిన్ను దలచుక
మచ్చిక గాచితి నన్ను మఱవనిదెట్టో

***********************************

ముఖారి

పుట్టించేవాడవు నీవే పోరులు వెట్టేవు నీవే
యెట్టు నేరుచుకొంటి విది నీవినోదమా

కొందరు దేవతలును కొందరు రాక్షసులును
ఇందరి కంతర్యామి వెప్పుడు నీవు
అంది కోప మొకరిపై అట్టె ప్రసాద మొకరి __
కిందులోనే పక్షపాత మిది నీకే తగును

నరకమనుచు గొంత నగి స్వర్గమని కొంత
నిరతి గురిసేసేవు నీకుక్షిలోనే
ధర జీక టొకవంక తగ వెన్నె లొకవంక
నెరపేవు నీమాయ నీకే తెలుసును

దానిపరిపాలనము తగు దుష్టశిక్షణము
వాసిగైకొంటివి నీకు వశమై రెండు
దోసము నీవల్ల లేదు తొలుతే శ్రీవేంకటేశ
సేసినవారిపుణ్యమే చిత్తాన బెట్టితివి

***********************************

దేవగాంధారి

ఇతరదేవతల కిది గలదా
ప్రతి వేరీ నీప్రభావమునకు

రతిరాజజనక రవిచంద్రనయన
అతిశయశ్రీవత్సాంకుడవు
పతగేంద్రగమన పద్మాసతీపతి
మతి నిను దలచిన మనోహరము

ఘనకిరీటధర కనకాంబర పా__
వన క్షీరాంబుధివాసుడవు
వనజచక్రధర వసుధావల్లభ
నిను బేరుకొనిన నిర్మలము

దేవపితామహ త్రివిక్రమ హరి
జీవాంతరాత్మక చిన్మయుడా
శ్రీవేంకటేశ్వర శ్రీకర గుణనిధి
నీవా మనుటే నిజసుఖము

*****************************

మాళవిగౌళ

ఎట్టు వలసినా జేయు మేటి విన్నపము లిక
కట్టుకో పుణ్యమైనాగాక మరేమైనాను

నన్ను నెంచి కాచెనంటేనా యవగుణి నేను
నిన్ను నెంచి కాచేనంటే నీవు లక్ష్మీపతివి
యిన్నిటా నాకంటే హీనుడిక మరెవ్వడూ లేడు
వున్నతి నీకంటే ఘను లొకరూ లేరు

నిలువెల్లా నెంచుకొంటే నివ్వరిముల్లంత లేను
బలువుడ నీవైతే బ్రహ్మాండము
యెలమి నే నుపకార మెవ్వరికి జేయలేను
మెలగి నీవే తృణము మేరువు సేయుదువు

భావించ నీ వేలికవు బంటుమాత్రమింతే నేను
నీవు సర్వాంతరాత్మవు నే నొకడను
సావధానమున నేను సర్వభక్షకుండ నింతే
శ్రీవేంకటేశ నీవు జీవరక్షకుడవు

**********************************

శంకరాభరణం

వేవేలు బంధములు విడువ ముడువబట్టె
దైవమా నిన్నెట్టు తగిలేమయ్యా

పారీ ముందటిభవపాశములు
తీరీ దొల్లిటితిత్తిలో పుణ్యము
వూరీ గోరిక లొకటొకటే
యేరీతి సుజ్ఞాన మెరిగేనయ్యా

పట్టీ నాకొంగు పంచేంద్రియములు
తొట్టీ బాపము తోడుతనే
పెట్టీ భ్రమల బెరిగి నీమాయలు
అట్టే మోక్ష మెన్నడందేమయ్యా

విందై యిహము వెనకకు దీసీ
అందీ వైరాగ్య మరచేతికి
కందువ శ్రీవేంకటపతి యీ రెండు
బొందించితి వేది భోగింతునయ్యా

****************************

కన్నడగౌళ

ఎట్టు గెలుతు బంచేంద్రియముల నే
బట్టరానిఘనబలవంతములు

కడునిసుమంతలు కన్నులచూపులు
ముడుగక మిన్నులు ముట్టెడిని
విడువక సూక్ష్మపువీనులు యివిగో
బడిబడి నాదబ్రహ్మము మోచె

అదె తిలపుష్పంబంతనాసికము
కదిసి గాలి ముడెగట్టెడని
పొదిగి నల్లెడే పొంచుక నాలికె
మొదలుచు సర్వము మింగెడిని

బచ్చెనదేహపుపైపొర సుఖమే
యిచ్చ బ్రపంచం బీనెడిని
చెచ్చెర మనసిది శ్రీవేంకటేశ్వరు
దచ్చి తలచగా దరిచెరెడిని

****************************

భౌళిరామక్రియ

నే నొక్కడ లేకుండితే నీకృపకు బాత్ర మేది
పూని నావల్లనే కీర్తి బొందేవు నీవు

అతి మూడులలోన నగ్రేసరుడ నేను
ప్రతిలేనిఘనగర్వపర్వతమను
తతి బంచేంద్రియములధనవంతుడను నేను
వెతకి నావంటివాని విడువగ జెల్లునా

మహిలో సంసారపుసామ్రాజ్యమేలేవాడ నేను
యిహమున గర్మవహికెక్కితి నేను
బహుయోనికూపసంపద దేలేవాడ నేను
వహించుక నావంటివాని దేనోపేవా

భావించి నావంటినీచు బట్టి కాచినప్పుడుగా
యేవంక నీకీర్తి గడువెంతురు భువి
నావల్ల నీకు బుణ్యము నీవల్లనే బ్రదుకుదు
శ్రీవేంకటేశుడ యింత చేరె జుమ్మీ మేలు

*****************************************


దేసాక్షి

నీవే నేరవుగాని నిన్ను బండించేము నేము
దైవమా నీకంటే నీదాసులే నేర్పరులు

వట్టిభక్తి నీమీద వళుకువేసి నిన్ను
బట్టితెచ్చి మతిలోన బెట్టుకొంటిని
పట్టెడుదులసి నీపాదములపై బెట్టి
జట్టిగొనిరి మోక్షము జాణలు నీదాసులు

నీవు నిర్మించిన వేనీకే సమర్పణ సేసి
సోవల నికృపయెల్ల జూరగొంటిమి
భావించొకమొక్క మొక్కి భారము నీపై వేసిరి
పావనపునీదాసులే వంతపుచతురులు

చెరువులనీళ్ళు దెచ్చి చేరడు నీపైజల్లి
వరము వడసితిమి వలసినటు
యిరవై శ్రీవేంకటేశ యిటువంటివిద్యలనే
దరిచేరి మించిరి నీదాసులే పో ఘనులు
*********************************

Friday, June 10, 2005

ఇతర చింత లిక నేమిటికి etc..

గుండక్రియ

ఇతర చింత లిక నేమిటికి
అతడే గతియై అరసేటివాడు

కర్మమూలమే కాయము నిజ
ధర్మమూలమే తనయాత్మ
అర్మిలి రెంటికి హరియొకడే
మర్మ మీతడే మనిపేటివాడు

బహుభోగమయము ప్రపంచము
నిహితజ్ఞానము నిజముక్తి
ఇహపరములకును యీశ్వరుడే
సహజపుకర్తై జరపేటివాడు

అతిదుఃఖకరము లానలు
సతతసుఖకరము సమవిరతి
గతి యలమేల్మంగతో శ్రీవేంకట
పతి యొకడిన్నిట బాలించువాడు

--అన్నమయ్యపాట
**********************************************

శంకరాభరణం

అచ్చుత మిమ్ముదలచేయంతపని వలెనా
యిచ్చల మీవారే మాకు నిహపరా లియ్యగా

మిమ్ము నెఱిగినయట్టిమీదాసుల నెఱిగే_
సమ్మవిజ్ఞానమే చాలదా నాకు
వుమ్మడి మీసేవ సేసుకుండేటివైష్ణవుల_
సమ్ముఖాన సేవించుటే చాలదా నాకు।

నిరతి నీకు మొక్కేనీడింగరీలకు
సరవితో మొక్కుటే చాలదా నాకు
పరగ నిన్ను బూజించే ప్రసన్నుల బూజించే_
సరిలేనిభాగ్యము చాలదా నాకు।

అంది నీకు భక్తులై నయలమహానుభావుల_
చందపువారిపై భక్తి చాలదా నాకు
కందువ శ్రీ వేంకటేశ కడు నీబంటుబంటుకు
సందడిబంటనవుటే చాలదా నాకు ।

**********************************************************

నవనీతచోర నమో నమో
నవమహిమార్ణవ నమో నమో।

హరి నారాయణ కేశవాచ్యుత శ్రీకృష్ణ
నరసింహ వామన నమో నమో
మురహర పద్మ నాభ ముకుంద గోవింద
నరనారాయణరూప నమో నమో

నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవ
నగధర నందగోప నమో నమో
త్రిగుణాతీత దేవ త్రివిక్రమ ద్వారక_
నగరాధినాయక నమో నమో।

వైకుంఠ రుక్మిణీవల్లభ చక్రధర
నాకేశవందిత నమో నమో
శ్రీకరగుణనిధి శ్రీ వేంకటేశ్వర
నాకజనననుత నమో నమో

*********************************************************

శంకరాభరణం

అతడే సకలము అని భావింపుచు
నీతితో నడవక నిలుకడ యేది

యెందును జూచిన యీశ్వరు డుండగ
విందుల మనసుకు వెలితేది
సందడించేహరిచైతన్య మిదివో
కందువలిక వెదకగ నేది

అంతరాత్ముడై హరి పొడచూపగ
సంతపుకర్మవుభయ మేది
సంతత మాతడే స్వతంత్రుడిదివో
కొంత గొంత మరి కోరెడి దేది,

శ్రీవేంకటపతి జీవుని నేలగ
యీవల సందేహ మిక నేది
భావం బీతడు ప్రపంచ మీతడు
వేవేలుగ మరి వెదకేది దేది।

******************************************************

సాళంగనాట

అద్దిగా వోయయ్య నే నంతవాడనా! వొక_
కొద్ది నీదాసులసేవ కోరగలగాక

హరి నీమాయలకు నే నడ్డము చెప్పేవాడనా
అరిదైన దదియు రాచాజ్ఞ గనక
పరమ పదాన కానపడుటయు ద్రోహము
సొరిది నీభండారము సొమ్ముగనక

పంచేద్రియముల నే బారదోలేవాడనా
ముంచి నీవు వెట్టినట్టి ముద్ర కర్తలు
అంచల నావిజ్ఞాన మది దహించవచ్చునా
నించి నీవు పాతినట్టినిధాన మది

వొట్టి సంసారపు మోపు నోపననేవాడనా
వెట్టి మమ్ము జేయించేటివేడుక నీది
గట్టిగా శృఈవేంకటేశ కదిసి నీశరణంటి
ఱట్టుగ నే జెప్పేనా మీఱగ నీరహస్యము

************************************************


రామక్రియ

ఇచ్చలో గోరేవల్లా ఇచ్చేధనము
అచ్చుతనామమెపో అధికపుధనము

నారదాదులువొగడేనాలుకపయిధనము
సారపువేదములలో చాటేధనము
కూరిమిమునులు దాచుకొన్నట్టిధనము
నారాయణనామ మిదే నమ్మినట్టిధనము

పరమపదవికి సంబళమైనధనము
యిరవై భక్తులకెల్లా నింటిధనము
పరగ నంతరంగాన పాతినట్టిధనము
హరినామ మిదియపో అరచేతిధనము

పొంచి శివుడు కాశిలో బోధించేధనము
ముంచినాఅచార్యుల మూలధనము
పంచి శ్రీ వేంకటపతి పాలించేధనము
నించి విష్ణునామ మదే నిత్యమైనధనము।

***********************************

శ్రీరాగం

ఇతనికంటె ఘనులిక లేరు
యితరదేవతలయిందరిలోన

భూపతి యీతడె పొదిగి కొలువరో
శ్రీపతి యీతడే చేకొనరో
యేపున బలువుడు నీతడే చేరరో
పైపై వేంకటపతి యైనాడు।

మరుగురు డితడే మతి నమ్మగదరో
పరమాత్ము డితడె భావించరో
కరివరదు డితడె గతి యని తలచరో
పరగ శ్రీ వేంకటపతి యైనాడు

తల్లియు నితడే తండ్రియు నితడే
వెల్లవిరై యిక విడువకురో
చల్లగా నితని శరణని బ్రతుకరొ
అల్ల శ్రీవేంకటహరి యయినాడు

***********************************

లలిత

చూడ వేడుకలు సొరిది నీమాయలు
తోడనే హరి హరి దొరసీ నిదివో

పుట్టేటిజీవులు పొదలేటిజీవులు
జట్టిగొని రిదియే జగమెల్లా
కట్టిడికర్మము కాయజుమర్మము
నెట్టుకొన్న దిదెనిఖిలంబెల్లా

ములిగేటిదనములు మోచేటిధనములు
కలిమి మెరసె లోకంబెల్లా
పొససి వేగుటలు పొద్దు గుంకుటలు
కలిగిన విదివో కాలంబెల్లా

లేటిపురుషులు తమకపు కాంతలు
బగివాయని దీబదుకెల్లా
అగపడి శ్రీవేంకటాధిప నీకృప
దెగనీజివనము దినదినమెల్లా।

*************************************************

దేవగాంధారి

ఎన్నడొకో నే దెలిసి యెక్కుడయి బ్రదికేది
పన్నిననాగుణమెల్లా భ్రమత పాలాయ।

ధనమద మిదె నన్ను దైవము నెఱ గనీదు
తనుమద మెంతయిన తపము జేయనీదు
ఘన సంసారమదము కలుషము బాయనీదు
మవెడినామనువెల్ల మదముపాలాయ।

పొంచి కామాంధకారము పుణ్యము గానగనీదు
కంచపుజన్మపుచిక్కు గతి చూపదు
పెంచి యజ్ఞానతనము పెద్దల నెరగనీదు
చించరానినాబుద్ది చీకటిపాలాయ।

శ్రీ వేంకటేశ్వరమాయ చిత్తము దేరనీదు
యేవంకా నీతడే గతి యిన్నిటా మాకు
యేవుపాయమును లేక యీతని మఱగు చొచ్చి
దేవుడంతర్యామి యని తేజము బొందితిమి।

Monday, June 06, 2005

గుజ్జర

ఇంతేపో వారివారిహీనాధికములెల్ల
పంతాన తా మేపాతిభాగ్యము నాపాటే।

అందరిలో దేవుడుండు అందధికులు గొందరు
కొందరు హీనులై కుందుదు రింతే
చెంది వీచేగాలొకటే చేనిపంటా నొకటే
పొంది గట్టికొలుచుండి పొల్లు కడబడును।

పుట్టుగందరి కొకటే భూమిలో యేలికలును
వెట్టిబంట్లు గొందరై వీగుదు రింతే
చుట్టి వరి గురుమతో జొన్న గింజ సరిదూగు
తెట్టెలై మేలొకటికి తీలొకటికాయ

కోరి శ్రీవేంకటపతికుక్షిలోనే లోకములు
ఆరయ గిందెడు మీదెడై వున్నవింతే
యీరీతి నితనిదాసు లెక్కిరి పొడవులకు
తారి కిందికి దిగిరి దానవులై కొందరు

*****************************************

లలిత

అన్నిటా నాపాలిటికి హరి యాతడే కలడు
యెన్నికగా దుధిపద మెక్కితిమి మేలు

కొందరు జీవులు నన్ను గోపగించినా మేలు
చెంది కొందరట్టె సంతసించినా మేలు
నిందించి కొందరు నన్ను నేడే రోసినా మేలు
పొందుగ కొందరు నన్ను బొగడినా మేలు

కోరి నన్ను బెద్దసేసి కొందరు మొక్కినా మేలు
వేరే హీనుడని భావించినా మేలు
కూరిమి గోదరు నన్ను గూడుకుండినా మేలు
మేరతో విడిచి నన్ను మెచ్చకున్నా మేలు

యిప్పటికిగలపాటి యెంతపేదయినా మేలు
వుప్పతిల్లుసంపద నాకుండినా మేలు
యెప్పుడు శ్రీవేంకటేశు కేనిచ్చినజన్మ మిది
తప్పు లే దాతనితోడితగులమే మేలు

*****************************************************

ధన్నాసి

ఊరకే నీశరణని వుండుటే నాపనిగాక
యీరీతి నావుపాయము లేడ కెక్కీనయ్యా

ముందే అంతర్యామివై మొగి నాలో నుండగాను
చెంది నిన్ను లేనివానిజేసుక నామనసులో
గొంది నీయాకారముగా కొంత నే భావించుకొంటా
ఇందు గల్పిత ధ్యానము లెట్టు చేసేనయ్యా

కన్నులు జూచినందెల్ల కమ్మి నీవై యుందగాను
అన్నిటా బ్రత్యక్షమందు అభావన చేసుకొని
విన్ననై తెలియలేక వేరే యెందొ వెదకుచు
పన్నినప్రయాసాల బడనేటికయ్యా

శ్రీ వేంకటాద్రిమీద శ్రీపతివై కొలువుండి
ఆవటించి తలపులో నచ్చొత్తి నట్టుండగాను
దేవు డెట్టివాడంటా తెగనిచదువులందు
సోవలుగా నింకనేమి సోదించేనయ్యా

*************************************

రామక్రియ

భూమిలోన గొత్తలాయ బుత్రోత్సవ మిదివో
నేమవుకృష్ణజయంతి నేడే యమ్మా

కావిరి బ్రహ్మాండము కడుపులోనున్న వాని
దేవకి గర్భమున నద్దిర మోచెను
దేవతలెల్ల వెదకి తెలిసి కాననివాని
యీవల వసుదేవుడు యెట్టు గనెనమ్మా

పొడవుకు బొడవైన పురుషోత్తముడు నేడు
అడరి తొట్టెలబాలుడాయ నమ్మ
వుడుగక యజ్ఞ భాగమొగి నారగించేవాడు
కొడుకై తల్లిచన్నుగుడిచీనమ్మా

పాలజలధియల్లుండై పాయకుండేయీతనికి
పాలవుట్లపండుగ బాతే యనటే
అలరి శ్రీవేంకటాద్రి నాటలాడనే మరిగి
పేలరియై కడు పెచ్చువెరిగీనమ్మా

********************************
లలిత

అందాకా నమ్మలేక అనుమానపడు దేహి
అంది నీసొమ్ముగనక అదియు దీరుతువు

నీదాసుడననేటినిజబుద్ది గలిగితే
అదెస నప్పుడే పుణ్యుడాయ నతడు
వేదతొ వొక్కొక్క వేళ వెలుతులు గలిగితే
నిదయవెట్టి వెనక నీవే తీరుతువు

తొలుత నీశరణము దొరకుటొకటేకాని
చెలగి యాజీవునికి జేటు లేదు
కలగి నడుమంత్రాన గతిదప్పనడచిన
నెలకొని వంకలొత్తనీవే నేరుతువు

నీ వల్ల గొరత లేదు నీపేరు నొడిగితే
శ్రీవేంకటేశ యిట్టె చేరి కాతువు
భావించలేకుండగాను భారము నీదంటే జాలు
నీవారి రక్షించ నీవె దిక్కౌదువు

****************************************

లలిత

కడునజ్ఞానపుకరపుకాల మిదె
వెడలదొబ్బి మావెరపు దీర్చవె

పాపపుపొఅసురము బందెలు మేయగ
పోపులపుణ్యము పొలివోయ
శ్రీపతి నీకే చేయి చాచెదము
యేపున మమ్మిక నీడేర్చవె

యిల గలియగమనుయెండలు గాయగ
చెలగి ధర్మమనుచెరు వింకె
పొలసి మీకృపాంబుధి చేరితి మిదె
తెలిసి నాదాహము తీర్చవె

వడిగొని మనసిజవాయువు విసరగ
పొడవగు నెఱకలు పుటమొగసె
బడి శ్రీవేంకటపతి నీశరణము
విడువక చొచ్చితి వెసగావగదే

******************************

గుజ్జర

భావించి నేరనైతి పశుబుద్ది నైతిని
యీవల నాయపచార మిది గావవయ్యా

హరి నీవు ప్రపంచమందు బుట్టించితి మమ్ము
పరము నే సాధించేది బలుద్రోహ మవుగాదో
నీరులనేలేటివాడు చెప్పినట్టు సేయక
విరసాలు బంట్లకు వేరే సేయదగునా

పంచేద్రియములు నాపై బంపువెట్టితివి నీవు
యెంచి వాని నే దండించే దిది నేరమౌగాదో
పెంచేటితల్లిదండ్రులు ప్రియమైవడ్డించగాను
కంచము కాలదన్న సంగతియా బిడ్డలకు

మిక్కిలిసంసారము మెడగట్టితివి నాకు
అక్కర నే వేసారేది అపరాధ మవుగాదో
దిక్కుల శ్రీవేంకటాద్రిదేవుడ నీవియ్యగాను
యెక్కడో జీవుడ నేను యెదురాడదగునా


**************************************

రామక్రియ

గరుడధ్వజం బెక్కె కమలాక్షు పెండ్లికి
పరుష లదివో వచ్చె బైపై సేవించను

పాడిరి సోబాన నదే భారతియు గిరిజయు
ఆడిరి రంబాదులైనఅచ్చరలెల్ల
కూడిరి దేవతలెల్ల గుంపులై శ్రీవేంకటాద్రి
వేడుకలు మీరగ శ్రీవిభునిపెండ్లికిని

కురిసె బువ్వులవాన కుప్పలై యెందు చూచిన
మొరసె దేవదుందుభిమోతలెల్లను
బెరసె సంపదలెల్ల పెంటలై శ్రీవేంకటాద్రి
తిరమైమించిన దేవదేవుని పెండ్లికిని

వేసిరి కానుకలెల్ల వేవేలు కొప్పెరలు
పోసి రదే తలబాలు పుణ్యసతులు
ఆసల శ్రీవేంకటేశుడలమేలుమంగదాను
సేసలు వెట్టినయట్టిసింగారపు పెండ్లికి

*************************

Sunday, June 05, 2005

భగవత్ప్రబోధం

రాగం : భూపాళం

తాళం : జంపె



పల్లవి

శ్రీ వేంకటేశ రాజీవాక్ష మేలుకొనవే
వేగవేగ మేలుకొను వెలిఛాయ లమరే

చరణాలు
సురలు గంధర్వ కిన్నరులెల్ల గూడి తం
బురుశ్రుతులను జేర్చి సరవిగాను
అరుణోదయము దెలిసి హరిహరి యనుచు నర
హరి నిన్ను దలచెదరు హంసస్వరూప

అల చిలుక పలుకులకు నధరబింబము బోలె
తెలివి దిక్కుల మిగుల తేట బారే
అలరు కుచగిరుల నుదయాస్త్రాదిపై వెలిగె
మలినములు తొలగ నిదో మంచు తెరవిచ్చే

తళుకొత్త నిందిరా తాటంకరైరుచుల
వెలిగన్ను తామరలు వికసింపగాను
అలర్మేల్ మంగ శ్రీవేంకటాచలరమణ
చెలువు మీఱగను ముఖకళలు గనవచ్చే


రాగం: యదుకులకాంబోది

తాళం : చాపు



౧। అప్ప డుండే కొండలోన ఇప్పపూల ఏరబోతే
ఇప్పపూలు కప్పలాయెరా ఓ వేంకటేశ
అప్పలుగల వాని వలనే ఓ వేంకటేశ।

౨। ఆకాశాన పొయ్యేకాకి మూకజూచి కేకవేశే
మూక మూడు విధము లాయరా - ఓ వేంకటేశ
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ।

౩। అహోబిలయ్య గుంటలోన వొల్వలు ఉదుక పోతే
వొల్వలెల్ల మల్ల్యెలాయే - ఓ వేంకటేశా
దీనిభావము నీకే తెలుసురా ఓ వేంకటేశా।

౪। అహోబిలాన చెట్టు బుట్టే భూమి యెల్ల తీగపారే
కంచిలోన కాయ కాచేరా ఓ వేంకటేశా
శ్రీరంగాన పండు పండేరా ఓ వేంకటేశా।

౫। పుట్టామీద చెట్టు బుట్టే భూమియెల్ల తీగపారే
పర్వతాన పండు పండేరా ఓ వేంకటేశా
అందవచ్చు కోయరాదురా - ఓ వేంకటేశా।

౬। చేయిలేనివాడుకోశే నెత్తిలేని వాడుమేశే
కాళ్ళులేని వాడు నడచే ఓ వేంకటేశా
పెదవిలేనివాడు చిలుక తినేరా ఓ వేంకటేశా।

౭। గుంట యెండి పండు పండే - పండుకోశి కుప్పవేశే
కుప్పకాలి యప్పు తీరేరా - ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా।

౮। సందెకాడ తలవ్రాలు సంధిదీరి వేంకటరాయా!
తెల్లవారనాయనీడరా ఓ వేంకటేశ!
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ!

౯। ముత్యాల పందిటిలోన ముగ్గురు వేంచేసి రాగ
ముక్కంటి దేవుని జూచేరు ఓ వేంకటేశా!
దీని భావము నీకే తెలుసురా! ఓ వేంకటేశా!

౧౦। ఏటిలోన వలవేశే తాటిమాను నీడలాయె
దూరపోతే చోటులేదురా ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా।

౧౧। ముందు కూతు రాలు ఆమె ముందు ఆలు కూతురాయె
పొందుగా పెండ్లాము తానాయె ఓ వేంకటేశ
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా।

౧౨। ఆకులేని అడవిలోన మూడుతోకల పెద్దపులిని
మేక యొకటి యెత్తి మింగేరా ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఒ వేంకటేశా।

౧౩। పున్నమ వెన్నెలలోన వన్న్యలాడితోను గూడి
కిన్నెర మీటుచు పొయ్యేవు ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా।

౧౪। అర్థరాత్రివేళలోని రుద్రవీణ నెత్తుకొని
నిద్రించిన నిన్ను పాడగ - ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా - ఓ వేంకటేశా।

తాళ్ళపాక పదసాహిత్యము సంపుటము ౨౭
శృంగార సంకీర్తనలు నుండి
*************

annamayya songs

అన్నమయ్య పాటలు

రేకు ౨౧౦ మాళవి

ఇట్టి ప్రతాపముగల యీతని దాసులనెల్ల
కట్టునా కర్మములెల్ల గాలి బోబుగాక

యెలమి జక్రాయుధున కెదురా దానవులు
తొలగ కెందుచొచ్చిన దుండించుగాక
ఇల గరుడధ్వజుపై నెక్కునా విషములు
కలగి నీరై పారి గాలిబోబుగాక


గోవర్దనధరునిపై కొలువునా మాయలు
వేవేలుదునుకలై విరుగుగాక
కేవలుడచ్యుతునొద్ద గీడు చూపగలవా
కావరమై తా దానె గాలి బోవుగాక

ఇట్టి

వీరనారసింహునకు వెరపులు గలవా
దూరాన గగ్గులకాడై తొలగుగాక
కోరి యీ శ్రీవేంకటేశు గొలిచితి మిదివో
కారుకొన్నపగలెల్ల గాలి బోవుగాక

ఇట్టి

******************************************


బౌళి


ఏది నిజంబని యెటువలె నమ్ముదు
పోది తోడ నను బోధింపవే

సత్తు నసత్తని సర్వము నీవని
చిత్తగించి శ్రుతి చెప్పెడిని
వుత్తమమధ్యమ మొగి గలదని మరి
యిత్తల శాస్త్రము లేర్పరచీని

ఏది

నానారూపులు నరహరి నీపని
పూనినవిధు లిటు పొగడెడిని
మానక హేయము మరి వుపాధేయము
కానవచ్చి యిల గలిగియున్నవి

ఏది

భావాభావము పరమము నీవని
దైవజ్ఞులు నిను దలచెదరు
శ్రీవేంకటగిరి జెలగిననీవే
తావుగ మదిలో దగిలితివి

ఏది

************************************************

సాళంగనాట


గెలిచితి భవములు గెలిచితి లోకము
యెలమి నీదాసుల కెదురింక నేది

జయ జయ నరసింహా జయ పుండరీకాక్ష
జయ జయ మురహర జయ ముకుంద
భయహరణము మాకు పాపనాశనము
క్రియతోడి నీ సంకీర్తన గలిగె

నమో నమో దేవ నమో నాగపర్యంక
నమో వేదమూర్తి నారాయణా
తిమిరి మమ్ము గావగ దిక్కయి మాకు నిలువ జమళీభుజముల శంకుజక్రములు గలిగె

రక్ష రక్ష పరమాత్మ రక్ష శ్రీవేంకటపతి
రక్ష రక్ష కమలారమణ పతి
అక్షయసుఖ మియ్యగల వటు దాపుదండగా
పక్షి వాహనుడ నీ భక్తి మాకు గలిగె

గెలి


****************************************************

దేపాళం

ఎక్కడ చూచిన వీరే యింటింటిముంగిటను
పెక్కుచేతలు సేసేరు పిలువరే బాలుల

పిన్నవాడు కృష్ణుడు పెద్దవాడు రాముడు
వన్నె నిద్ద రమడలవలె నున్నారు
వెన్నలు దొంగిలుదురు వీడు వాడు నొక్కటే
పన్నుగడై వచ్చినారు పట్టరే యీబాలుల

ఎక్క

నల్లనివాడు కృష్ణుడు తెల్లనివాడు రాముడు
అల్లదివో జోడుకోడెలై వున్నారు
వెల్లవిరై (?) తిరిగేరు వేరు లేదిద్దరికిని
పెల్లుగ యశోదవద్ద బెట్టరె యీబాలుల

రోల జిక్కె నొకడు రోకలి పట్టె నొకడు
పోలిక సరిబేనికి బొంచి వున్నారు
మేలిమి శ్రీవేంకటాద్రి మించిరి తానే తానై
ఆలించి నెవ్వరి నేమి ననకురే బాలుల

************************************************

నాట

దాసోహ మనుబుద్ది దలచరు దానవులు
యీసులకే పెనగేరు యిప్పుడూ గొందరు

హరిచక్రముదూషించేయట్టి వారే యసురులు
అరయ దామేదైవమన్న వారు నసురలే
ధర నరకాసురుడు తానే దైవమని చెడె
యిరవై యిది మానరు యిప్పుడూ గొందరు

పురుషోత్తముని పూజపొంత బోరు అసురలు
సరవి విష్ణుని జపించనివారు నసురలే
హిరణ్యకశిపుడును యీతని నొల్లక చెడె
యిరవై యీతని నొల్ల రిప్పుడూ గొందరు

సురలును మునులును శుకాదియోగులును
పరమము శ్రీవేంకటపతి యనుచు
శరణని బ్రదికేరు సరి నేడు వైష్ణువులు
యెరపరికాన బొయ్యేరప్పుడూ గొందరు

*********************************************

వెర్రివాడ వెర్రివాడ వినియు గనియు మర
వెర్రి దెలిసి రోకలి వేరె చుట్టేగాక

పుట్టించిన వాడవట పూచి నన్ను బెంచలేవా
కట్టగడ నమ్మని నాకడమేకాక
వొట్టి నాలో నుందువట వొగి బాపము నాకేది
గట్టిగా బుణ్యము వేరే కట్టుగొనేగాక

యేడనైనా నీవేయట యెదుట నుండగలేవా
వేడ వెట్టి యేడనైనా వెదకేగాక
ఆడినదెల్లా నీవట అందులో దప్పులున్నవా
వీడు పడ్డతలపుతో వెరచేగాక

భాచించితే మెత్తువట పరము నీవియ్యలేవా
నీ వాడనన్ని నా నేరమే కాక
శ్రీవేంకటేశుడ నేను చేరి నీకు శరణంటి
దేవుడవై కావగా నే దిద్దుకొనేగాక

*************************************************

ఆహిరి

పూచిన యీదేహము పువ్వుగాని పిందెగాని
చేచేత నెవ్వరికి జెప్పనోప బ్రియము

పుట్టించినదైవము పూరి మేపునా మమ్ము
బట్టిన పూర్వకర్మము పాసిపొయ్యీనా
మెట్టినసంసారము మెదిగినపాటే చాలు
తొట్టి కన్నవారినెల్ల దూరనోప మిందుకు

నొసల వ్రాసిన వ్రాలు నునిగితే మానినా
కొసరి జగము నాకే కొత్తలయ్యీనా
వుసురుతోడిసుఖము వుందినపాటే చాలు
కొసరి జన్మము లింకా గోరనోప నేను

యేలినవాడు శ్రీ హరి యేమిసేసినా మేలె
వేళతో నాతడే శ్రీవేంకటేశుడు
పాలించె నాతడు మమ్ము పదివేలులాగులను
యీలాగులనే సుఖించేము నేము

***************************************

ధన్నాసి

పుట్టినట్టె వున్న వాడ పోలేదు రాలేదు
ఇట్టె నీదాసుడనైతి యెంగిలెల్ల బాపె

వెలినున్న జగమెల్ల విష్ణుడ నీమహిమే
అలరి నాలోన నీవే అంతరాత్మవు
తెలిసి నేనున్న చోటే దివ్యవైకుంఠము
వెలలేనినరకములవెరపెల్ల దీరె

తనువుతోనుండేది నీతల చినతలపేనా
మనుపుసంసారము నీమాయచేతిదే
పనులనాకర్మము నీపంచినట్టి పనుపే
మనసులోపలియనుమానమెల్ల బాసె

తెరమరుగుదినాలు వుడ నీకల్పితమే
సొరిది యీసురలెల్ల చుట్టాలే నాకు
నిరతి శ్రీ వేంకటేశ నీ మరగు చొచ్చి నేడు
గురునియానతిచేత గొంకులెల్లా బాసె

**********************************************

వరాళి

ఐనదయ్యీ గానిదెల్లా నటు గాకుండితే మానీ
మానుపరా దివి హరిమాయా మహిమలు

పుట్టేటి వెన్ని లేవు పోయేటి వెన్ని లేవు
వెట్టి దేహాలు మోచినవెడజీవులు
గట్టిగా దెలుసుకొంటే కలలోనివంటి దింతే
పట్టి ఇందుకుగా నేల బడలేమో నేము

కడచిన వెన్ని లేవు కాచుకున్న వెన్ని లేవు
సుడిగొన్న తనలోని సుఖదుఃఖాలు
యెడపుల నివి రెండు యెండనీడవంటి వింతే
కడనుండి నే మేలకరగేమో నేము

కోరినవి యెన్ని లేవు కోరగల వెన్ని లేవు
తీరనైసంపదలతో తెందేపలు
ధారుణి శృఈవేంకటేశుదాసులమై యిన్నియును
చేరి కైకొంటిమి యేమి సేసేమో నేము

****************************************************

సాళంగం

భక్త సులభుడును పరతంత్రుడు హరి
యుక్తిసాధ్య మిదె యొకరికీ గాడు

నినుపగులోకముల నిండిన విష్ణుడు
మనుజుడ నాలో మనికియయ్యె
మునుకొని వేదముల ముడిగినమంత్రము
కొననాలికలలో గుదురై నిలిచె

యెలమి దేవతలనేలినదేవుడు
నలుగడ నదముని నను నేలె
బలుపగు లక్ష్మీపతియగుశ్రీహరి
యిల మాయింటను యిదివో నిలిచె

పొడవుకు బొడవగు పురుషోత్తముడిదె
బుడిబుడి మాచేత బూజగొనె
విడువ కిదివో శ్రీ వేంకటేశ్వరుడు
బడివాయడు మాపాలిట నిలిచి