Thursday, June 16, 2005

సాళంగనాట

అని రావణుతల లట్టలు బొందించి
చెనకి భూతములు చెప్పె బుద్ది

కట్టిరి జలనిధి కపిసేన లవిగో
చుట్టు లంక కంచుల విడిసె
కొట్టిరి దానవకోట్లతల లదే
కట్టిడిరావణ గతియో నీకు

యెక్కిరి కోటలు యిందరు నొకపరి
చిక్కిరి కలిగినచెరయెల్ల
పక్కన సీతకు బరిణామమాయ
నిక్కము రావణ నీకో బ్రదుకు

పరగ విభీషణు బట్టము గట్టెను
తొరలి లంకకును తొలుదొలుతే
గరిమెల శ్రీవేంకటగిరి రాముడు
మెరసెను రావణ మేలాయ బనులు


********************************

దేవగాంధారి

దైవము నీవే యిక దరి చేరుతువుగాక
జీవులవసము గాదు చిక్కిరి లోలోననే

పుట్టుట సహజ మిది పొదలేజీవులకెల్ల
గట్టిగా జగమునందు కలకాలము
నట్టేటివరదవలె నానాటినీమాయ
కొట్టుక పారగజొచ్చె కూడినవిజ్ఞానము

పాపమే సహజము బద్దసంసారులకెల్ల
కాపురపువిధులలో కలకాలము
తేపలేనిసముద్రమురెరగున కర్మమెల్లా
మాపురేపు ముంచజొచ్చె మతిలోనిధైర్యము

లంపటమే సహజము లలి దేహధారులకు
గంపమోపు కోరికెలకలకాలము
యింపుల శ్రీవేంకటేశ ఇదె నీదాసులని
పంపుసేసి బ్రదికించె ప్రపన్నసుగతి

********************************

గుండక్రియ

ఇట్టి నాస్తికులమాట యేమని సమ్మెడి దిక
పట్టి సములమంటానే భక్తుల దూషింతురు

వేదములు చదువుతా విశ్వమెలా గల్లనేరు
ఆదెస తాము పుట్టుండి అదియును మాయనేరు
పాదగువిష్ణుడుండగ బయలు తత్వమనేరు
లేదు జీవతత్వమంటా లేమల బొందుదురు

తిరమై తమ ఇండ్ల దేవపూజలు సేసేరు
ధరలోన తముదామే దైవమనేరు
ఆరయగర్మమె బ్రహ్మమని యాచరించేరు
సరి నదే కాదని సన్యసించేరు

అందుక పురుషసూక్తమర్థము జెప్పుదురు
కందువ నప్పటి నిరాకారమందురు
యిందులో శ్రీవేంకటేశ యిటె నీ దాసులుగాక
మందపురాక్షసులాడేమతము నడతురు

******************************************

వసంతవరాళి

ఇహము బరము జిక్కె నీతనివంక
అహిశయనునిదాసులంతవారు వేరీ

సిరికలిగినవారు చింతలిన్నిటను బాసి
నిరతపువర్గముతో నిక్కేరటా
సిరికి మగడయిన శ్రీపతి యేలి మ__
మ్మరయుచునున్నాడు మాయంతవారు వెరి

బలవంతుడైనవాడు భయములిన్నిట బాసి
గెలిచి పేరువాడుచు గెరిలీనటా
బలదేవుడైన శ్రీపతి మా యింటిలోన
అలరివున్నాడు మాయంతవారు వేరి

భూములేలేటివాడు భోగములతో దనిసి
కామించి యానందమున గరగీనటా
సేమముతో భూపతైన శ్రీవేంకటేశుడు మాకు
ఆముకొనివుండగా మాయంతవారు వేరీ

**********************************

మాళవిగౌళ

అన్నియు నీతనిమూల మాతడే మాపలజిక్కె
కన్నుల మావేడుకకు కడయేది యికను

కామధేనువు గలిగితే గర్వించు నొక్కరుడు
భూమి యేలితే నొకడు పొదలుచుండు
కామించి నిధి గంటె కళలమించు నొకడు
శ్రీమంతుడగుహరి చిక్కె మాకు నిదివో

పరుసవేదిగలిగితే పంతములాడు నొకడు
ధర జింతామణబ్బితే దాటు నొకడు
సురలోక మబ్బితేను చొక్కుచునుండు నొకడు
పరమాత్ముడే మాపాలజిక్కెనిదివో

అమృతపానముసేసి యానందించు నొకడు
భ్రమసు దేహసిద్ది బరగొకడు
తమి శ్రీవేంకటేశుడే దాచినధనమై మాకు
అమరి నామతి జిక్కె నడ్డాములే దిదివో

************************************

దేవగాంధారి

పట్టరో వీదుల బరువులు వెట్టి
పుట్టుగులతో హరి పొలసీ వీడే

వేవేలు నేరాలు వెదకేటిదేవుడు
ఆవుల గాచీ నలవాడే
పోవుగ బ్రాహ్మల బుట్టించుదేవుడు
సోవల యశోదసుతుడట వీడే

ఘనయజ్ఞములకు గర్తగుదేవుడు
కినిసి వెన్న దొంగిలె వీడే
మునులచిత్తములమూలపుదేవుడు
యెనసీ గొల్లెతలయింటింట వీడే

నుడిగి నారదుడు నుతించుదేవుడు
బడిరోలగట్టువడె వీడే
వుడివోనివరము లొసగెడుదేవుడు
కడగిన శ్రీ వేంకటగిరి వీడే

**************************

భైరవి

వెఱ్రివారి దెలుపుటవేవేలు సుకృతము
ముఱ్రుబాలమంకే కాని ముందు గాన దైవమా

ఇంతకతొల్లిటిజన్మ మెటువంటిదో యెరగ
పొంతనే ఇటమీదటిపుట్టు వెరగ
పొంతనే ఇటమీదటిపుట్టు వెరగ
అంతరాన బెరిగేకాయమే నాకు సుఖమై
సంతసాన మురిసేను సంసారమందును

వొడలిలోపలిహేయ మొకైంతా దలచను
బడి నెదిటిదేహాలవచ్చి దలచ
సుడిసి పైపచారాలే చూచి సురతసుఖాన
పడతుల బొంది పొంది పరిణామించేను

పాపమూలమున వచ్చేబలునరకము లెంచ
యేపున బుణ్యపుబుద్ది ఇంచుకా నెంచ
దీపన జంతువును దెచ్చి పాపను జేసితి
చేపట్టి నన్ను రక్షించు శ్రీవేంకటేశుడా

*************************************

ఎందరితో బెనగేను యెక్కడని పొరలేను
కందర్ప జనక నీవే గతిగాక మాకు


నిక్కి నాబలవంతాన నేనే గెలిచేనంటే__
నొక్కపంచేంద్రియముల కోపగలనా
తక్కినసంసారవార్ది దాటగలనో మరి
దిక్కుల కర్మబంధము తెంచివేయగలనో

పన్నుకొన్నపాయమున పరము సాధించేనంటే
యెన్న నీమాయ కుత్తర మియ్యగలనా
వన్నెలనామనసే పంచుకోగలనో మరి
కన్నట్టి యీప్రపంచమే కడవగగలనో

వుల్లములో నిన్ను ధ్యాన మొగి నేజేసేనంటే
తొల్లిటియజ్ఞానము తోయగలనా
ఇల్లిదే శ్రీవేంకటేశ యెదుటనే నీకు మొక్కి
బల్లిదుడ నౌదుగాక పంద నే గాగలనా

*************************************

ఆహిరి

అయ్యో నానేరమికే అట్టే యేమని వగతు
ముయ్యంచుచంచలాన మోసపోతిగాక

కాననా నావంటివారే కారా యీజంతువులు
నానా యోనుల బుట్టి నడచేవారు
మానక నాగర్వమున మదాంధమున ముందు
గానక భయపడినకర్మి నింతేకాక

చదువనా నేదొల్లి జన్మజన్మాంతరముల
ఇది పుణ్య మిది పాప మింతంతని
వదలక నాభోగవాంఛలే పెంచి పెంచి
తుదకెక్క వెదకనిదుషుడనేను

వినవా నే బురాణాల వెనకటివారినెల్ల
మనెడిభాగవతులమహిమలెల్లా
యెనయుచు శ్రీవేంకటేశుకృపచేత నేడు
ఘనుడ నయితిగాక కష్టుడగానా


********************************

సాళంగనాట

ఆముస్వతంత్రులు గారు 'దాసోహము' నన లేరు
పామరపుదేహులకు పట్టరాదు గర్వము

పరగుబ్రహ్మాదులు బ్రహ్మమే తా మనలేరు
హరికే మొరవెట్టేరు ఆపదైతేను
ధరలో మనుజులింతే తామే దయివమనేరు
పొరి దాము చచ్చిపుట్టే పొద్దెరగరు

పండినవ్యాసాదులు ప్రపంచము కల్లనరు
కొండలుగా బురాణాల గొనియాడేరు
అండనే తిరిపెములై అందరినడిగి తా_
ముందుండి లేదనుకొనే రొప్పదన్నా మానరు

సనకాదియోగులు శౌరిభక్తి సేసేరు దు_
ర్జనులు భక్తి వొల్లరు జ్ఞానులమంటా
నినుపయి శ్రీవేంకటేశ నిను జేరి మొక్కుతానె
అనిశము నిరాకారమనేరు యీద్రోహులు

***************************************

శంకరాభరణం

ఎట్టు మోసపోతి నేను యివియెల్ల నిజమని
నెట్టాన హరినే నమ్మనేర నయితిగా

దేహమిది నాదని తెలిసి నమ్మివుండితే
ఆహా నే నొల్లనన్నా నటే ముదిసె
వూహల నాభోగమెల్లా వొళ్ళబట్టెనంటా నుంటే
దాహముతోడ నినుముదాగిననీరాయగా

మనసు నాదని నమ్మి మది మది నే పెంచితి__
ననుగుబంచేంద్రియములందు గూడెను
యెనసి ప్రాణవాయువు లివి సొమ్మని నమ్మితి
మెనసి లోను వెలినై ముక్కు వాత నున్నవి

ఇందుకొరకె నేను ఇన్నాళ్ళు పాటువడితి
ముందు వెనకెంచక నే మూఢుడ నైతి
అంది శ్రీవేంకటేశ్వరు డంతటా నుండి నా_
చందము చూచి కావగ జన్మమే యీడేరె

*******************************************

నాట

ఎందరైన గలరు నీ కింద్రచంద్రాదిసురలు
అందుర్లో నే నెవ్వడ నీ వాదరించే దెట్టో

పెక్కుబ్రహ్మాండములు నీపెనురోమకూపముల
గిక్కిరిశున్న వందొకకీటమ నేను
చక్కగా జీవరాసులసందడి బడున్నవాడ
ఇక్కువ నన్ను దలచి యెట్టు మన్నించేవో

కోటులైనవేదములు కొనాడీ నిన్నందులో నా_
నోటివిన్నపము లొక్క నువ్వు గింజంతే
మాటలు నేరక కొఱమాలి వాకిట నుండ
బాటగా నీదయ నాపై బారుటెట్టో

అచ్చపునీదాసులు అనంతము వారలకు
రిచ్చల నే నొకపాదరేణువ నింతే
ఇచ్చగించి శ్రీవేంకటేశ నిన్ను దలచుక
మచ్చిక గాచితి నన్ను మఱవనిదెట్టో

***********************************

ముఖారి

పుట్టించేవాడవు నీవే పోరులు వెట్టేవు నీవే
యెట్టు నేరుచుకొంటి విది నీవినోదమా

కొందరు దేవతలును కొందరు రాక్షసులును
ఇందరి కంతర్యామి వెప్పుడు నీవు
అంది కోప మొకరిపై అట్టె ప్రసాద మొకరి __
కిందులోనే పక్షపాత మిది నీకే తగును

నరకమనుచు గొంత నగి స్వర్గమని కొంత
నిరతి గురిసేసేవు నీకుక్షిలోనే
ధర జీక టొకవంక తగ వెన్నె లొకవంక
నెరపేవు నీమాయ నీకే తెలుసును

దానిపరిపాలనము తగు దుష్టశిక్షణము
వాసిగైకొంటివి నీకు వశమై రెండు
దోసము నీవల్ల లేదు తొలుతే శ్రీవేంకటేశ
సేసినవారిపుణ్యమే చిత్తాన బెట్టితివి

***********************************

దేవగాంధారి

ఇతరదేవతల కిది గలదా
ప్రతి వేరీ నీప్రభావమునకు

రతిరాజజనక రవిచంద్రనయన
అతిశయశ్రీవత్సాంకుడవు
పతగేంద్రగమన పద్మాసతీపతి
మతి నిను దలచిన మనోహరము

ఘనకిరీటధర కనకాంబర పా__
వన క్షీరాంబుధివాసుడవు
వనజచక్రధర వసుధావల్లభ
నిను బేరుకొనిన నిర్మలము

దేవపితామహ త్రివిక్రమ హరి
జీవాంతరాత్మక చిన్మయుడా
శ్రీవేంకటేశ్వర శ్రీకర గుణనిధి
నీవా మనుటే నిజసుఖము

*****************************

మాళవిగౌళ

ఎట్టు వలసినా జేయు మేటి విన్నపము లిక
కట్టుకో పుణ్యమైనాగాక మరేమైనాను

నన్ను నెంచి కాచెనంటేనా యవగుణి నేను
నిన్ను నెంచి కాచేనంటే నీవు లక్ష్మీపతివి
యిన్నిటా నాకంటే హీనుడిక మరెవ్వడూ లేడు
వున్నతి నీకంటే ఘను లొకరూ లేరు

నిలువెల్లా నెంచుకొంటే నివ్వరిముల్లంత లేను
బలువుడ నీవైతే బ్రహ్మాండము
యెలమి నే నుపకార మెవ్వరికి జేయలేను
మెలగి నీవే తృణము మేరువు సేయుదువు

భావించ నీ వేలికవు బంటుమాత్రమింతే నేను
నీవు సర్వాంతరాత్మవు నే నొకడను
సావధానమున నేను సర్వభక్షకుండ నింతే
శ్రీవేంకటేశ నీవు జీవరక్షకుడవు

**********************************

శంకరాభరణం

వేవేలు బంధములు విడువ ముడువబట్టె
దైవమా నిన్నెట్టు తగిలేమయ్యా

పారీ ముందటిభవపాశములు
తీరీ దొల్లిటితిత్తిలో పుణ్యము
వూరీ గోరిక లొకటొకటే
యేరీతి సుజ్ఞాన మెరిగేనయ్యా

పట్టీ నాకొంగు పంచేంద్రియములు
తొట్టీ బాపము తోడుతనే
పెట్టీ భ్రమల బెరిగి నీమాయలు
అట్టే మోక్ష మెన్నడందేమయ్యా

విందై యిహము వెనకకు దీసీ
అందీ వైరాగ్య మరచేతికి
కందువ శ్రీవేంకటపతి యీ రెండు
బొందించితి వేది భోగింతునయ్యా

****************************

కన్నడగౌళ

ఎట్టు గెలుతు బంచేంద్రియముల నే
బట్టరానిఘనబలవంతములు

కడునిసుమంతలు కన్నులచూపులు
ముడుగక మిన్నులు ముట్టెడిని
విడువక సూక్ష్మపువీనులు యివిగో
బడిబడి నాదబ్రహ్మము మోచె

అదె తిలపుష్పంబంతనాసికము
కదిసి గాలి ముడెగట్టెడని
పొదిగి నల్లెడే పొంచుక నాలికె
మొదలుచు సర్వము మింగెడిని

బచ్చెనదేహపుపైపొర సుఖమే
యిచ్చ బ్రపంచం బీనెడిని
చెచ్చెర మనసిది శ్రీవేంకటేశ్వరు
దచ్చి తలచగా దరిచెరెడిని

****************************

భౌళిరామక్రియ

నే నొక్కడ లేకుండితే నీకృపకు బాత్ర మేది
పూని నావల్లనే కీర్తి బొందేవు నీవు

అతి మూడులలోన నగ్రేసరుడ నేను
ప్రతిలేనిఘనగర్వపర్వతమను
తతి బంచేంద్రియములధనవంతుడను నేను
వెతకి నావంటివాని విడువగ జెల్లునా

మహిలో సంసారపుసామ్రాజ్యమేలేవాడ నేను
యిహమున గర్మవహికెక్కితి నేను
బహుయోనికూపసంపద దేలేవాడ నేను
వహించుక నావంటివాని దేనోపేవా

భావించి నావంటినీచు బట్టి కాచినప్పుడుగా
యేవంక నీకీర్తి గడువెంతురు భువి
నావల్ల నీకు బుణ్యము నీవల్లనే బ్రదుకుదు
శ్రీవేంకటేశుడ యింత చేరె జుమ్మీ మేలు

*****************************************


దేసాక్షి

నీవే నేరవుగాని నిన్ను బండించేము నేము
దైవమా నీకంటే నీదాసులే నేర్పరులు

వట్టిభక్తి నీమీద వళుకువేసి నిన్ను
బట్టితెచ్చి మతిలోన బెట్టుకొంటిని
పట్టెడుదులసి నీపాదములపై బెట్టి
జట్టిగొనిరి మోక్షము జాణలు నీదాసులు

నీవు నిర్మించిన వేనీకే సమర్పణ సేసి
సోవల నికృపయెల్ల జూరగొంటిమి
భావించొకమొక్క మొక్కి భారము నీపై వేసిరి
పావనపునీదాసులే వంతపుచతురులు

చెరువులనీళ్ళు దెచ్చి చేరడు నీపైజల్లి
వరము వడసితిమి వలసినటు
యిరవై శ్రీవేంకటేశ యిటువంటివిద్యలనే
దరిచేరి మించిరి నీదాసులే పో ఘనులు
*********************************

No comments: