Monday, June 06, 2005

గుజ్జర

ఇంతేపో వారివారిహీనాధికములెల్ల
పంతాన తా మేపాతిభాగ్యము నాపాటే।

అందరిలో దేవుడుండు అందధికులు గొందరు
కొందరు హీనులై కుందుదు రింతే
చెంది వీచేగాలొకటే చేనిపంటా నొకటే
పొంది గట్టికొలుచుండి పొల్లు కడబడును।

పుట్టుగందరి కొకటే భూమిలో యేలికలును
వెట్టిబంట్లు గొందరై వీగుదు రింతే
చుట్టి వరి గురుమతో జొన్న గింజ సరిదూగు
తెట్టెలై మేలొకటికి తీలొకటికాయ

కోరి శ్రీవేంకటపతికుక్షిలోనే లోకములు
ఆరయ గిందెడు మీదెడై వున్నవింతే
యీరీతి నితనిదాసు లెక్కిరి పొడవులకు
తారి కిందికి దిగిరి దానవులై కొందరు

*****************************************

లలిత

అన్నిటా నాపాలిటికి హరి యాతడే కలడు
యెన్నికగా దుధిపద మెక్కితిమి మేలు

కొందరు జీవులు నన్ను గోపగించినా మేలు
చెంది కొందరట్టె సంతసించినా మేలు
నిందించి కొందరు నన్ను నేడే రోసినా మేలు
పొందుగ కొందరు నన్ను బొగడినా మేలు

కోరి నన్ను బెద్దసేసి కొందరు మొక్కినా మేలు
వేరే హీనుడని భావించినా మేలు
కూరిమి గోదరు నన్ను గూడుకుండినా మేలు
మేరతో విడిచి నన్ను మెచ్చకున్నా మేలు

యిప్పటికిగలపాటి యెంతపేదయినా మేలు
వుప్పతిల్లుసంపద నాకుండినా మేలు
యెప్పుడు శ్రీవేంకటేశు కేనిచ్చినజన్మ మిది
తప్పు లే దాతనితోడితగులమే మేలు

*****************************************************

ధన్నాసి

ఊరకే నీశరణని వుండుటే నాపనిగాక
యీరీతి నావుపాయము లేడ కెక్కీనయ్యా

ముందే అంతర్యామివై మొగి నాలో నుండగాను
చెంది నిన్ను లేనివానిజేసుక నామనసులో
గొంది నీయాకారముగా కొంత నే భావించుకొంటా
ఇందు గల్పిత ధ్యానము లెట్టు చేసేనయ్యా

కన్నులు జూచినందెల్ల కమ్మి నీవై యుందగాను
అన్నిటా బ్రత్యక్షమందు అభావన చేసుకొని
విన్ననై తెలియలేక వేరే యెందొ వెదకుచు
పన్నినప్రయాసాల బడనేటికయ్యా

శ్రీ వేంకటాద్రిమీద శ్రీపతివై కొలువుండి
ఆవటించి తలపులో నచ్చొత్తి నట్టుండగాను
దేవు డెట్టివాడంటా తెగనిచదువులందు
సోవలుగా నింకనేమి సోదించేనయ్యా

*************************************

రామక్రియ

భూమిలోన గొత్తలాయ బుత్రోత్సవ మిదివో
నేమవుకృష్ణజయంతి నేడే యమ్మా

కావిరి బ్రహ్మాండము కడుపులోనున్న వాని
దేవకి గర్భమున నద్దిర మోచెను
దేవతలెల్ల వెదకి తెలిసి కాననివాని
యీవల వసుదేవుడు యెట్టు గనెనమ్మా

పొడవుకు బొడవైన పురుషోత్తముడు నేడు
అడరి తొట్టెలబాలుడాయ నమ్మ
వుడుగక యజ్ఞ భాగమొగి నారగించేవాడు
కొడుకై తల్లిచన్నుగుడిచీనమ్మా

పాలజలధియల్లుండై పాయకుండేయీతనికి
పాలవుట్లపండుగ బాతే యనటే
అలరి శ్రీవేంకటాద్రి నాటలాడనే మరిగి
పేలరియై కడు పెచ్చువెరిగీనమ్మా

********************************
లలిత

అందాకా నమ్మలేక అనుమానపడు దేహి
అంది నీసొమ్ముగనక అదియు దీరుతువు

నీదాసుడననేటినిజబుద్ది గలిగితే
అదెస నప్పుడే పుణ్యుడాయ నతడు
వేదతొ వొక్కొక్క వేళ వెలుతులు గలిగితే
నిదయవెట్టి వెనక నీవే తీరుతువు

తొలుత నీశరణము దొరకుటొకటేకాని
చెలగి యాజీవునికి జేటు లేదు
కలగి నడుమంత్రాన గతిదప్పనడచిన
నెలకొని వంకలొత్తనీవే నేరుతువు

నీ వల్ల గొరత లేదు నీపేరు నొడిగితే
శ్రీవేంకటేశ యిట్టె చేరి కాతువు
భావించలేకుండగాను భారము నీదంటే జాలు
నీవారి రక్షించ నీవె దిక్కౌదువు

****************************************

లలిత

కడునజ్ఞానపుకరపుకాల మిదె
వెడలదొబ్బి మావెరపు దీర్చవె

పాపపుపొఅసురము బందెలు మేయగ
పోపులపుణ్యము పొలివోయ
శ్రీపతి నీకే చేయి చాచెదము
యేపున మమ్మిక నీడేర్చవె

యిల గలియగమనుయెండలు గాయగ
చెలగి ధర్మమనుచెరు వింకె
పొలసి మీకృపాంబుధి చేరితి మిదె
తెలిసి నాదాహము తీర్చవె

వడిగొని మనసిజవాయువు విసరగ
పొడవగు నెఱకలు పుటమొగసె
బడి శ్రీవేంకటపతి నీశరణము
విడువక చొచ్చితి వెసగావగదే

******************************

గుజ్జర

భావించి నేరనైతి పశుబుద్ది నైతిని
యీవల నాయపచార మిది గావవయ్యా

హరి నీవు ప్రపంచమందు బుట్టించితి మమ్ము
పరము నే సాధించేది బలుద్రోహ మవుగాదో
నీరులనేలేటివాడు చెప్పినట్టు సేయక
విరసాలు బంట్లకు వేరే సేయదగునా

పంచేద్రియములు నాపై బంపువెట్టితివి నీవు
యెంచి వాని నే దండించే దిది నేరమౌగాదో
పెంచేటితల్లిదండ్రులు ప్రియమైవడ్డించగాను
కంచము కాలదన్న సంగతియా బిడ్డలకు

మిక్కిలిసంసారము మెడగట్టితివి నాకు
అక్కర నే వేసారేది అపరాధ మవుగాదో
దిక్కుల శ్రీవేంకటాద్రిదేవుడ నీవియ్యగాను
యెక్కడో జీవుడ నేను యెదురాడదగునా


**************************************

రామక్రియ

గరుడధ్వజం బెక్కె కమలాక్షు పెండ్లికి
పరుష లదివో వచ్చె బైపై సేవించను

పాడిరి సోబాన నదే భారతియు గిరిజయు
ఆడిరి రంబాదులైనఅచ్చరలెల్ల
కూడిరి దేవతలెల్ల గుంపులై శ్రీవేంకటాద్రి
వేడుకలు మీరగ శ్రీవిభునిపెండ్లికిని

కురిసె బువ్వులవాన కుప్పలై యెందు చూచిన
మొరసె దేవదుందుభిమోతలెల్లను
బెరసె సంపదలెల్ల పెంటలై శ్రీవేంకటాద్రి
తిరమైమించిన దేవదేవుని పెండ్లికిని

వేసిరి కానుకలెల్ల వేవేలు కొప్పెరలు
పోసి రదే తలబాలు పుణ్యసతులు
ఆసల శ్రీవేంకటేశుడలమేలుమంగదాను
సేసలు వెట్టినయట్టిసింగారపు పెండ్లికి

*************************

No comments: